Wednesday, June 13, 2012

పాఠం1 : జీవితం - గమ్యం - లక్ష్యాలు -ప్రేరణ


లీడ్ ఇండియా మార్గదర్శి  యొక్క ఉపన్యాసావళి
పాఠం1 : జీవితం - గమ్యం - లక్ష్యాలు -ప్రేరణ

1.1 జీవితం అంటే ఏమిటి..దాని విలువ ఏమిటి?


1.1.1 మనిషి పుట్టుకకు చావుకు మద్య ఉండే సమయం జీవితం.. మనము అబ్బాయిగా పుట్టలా అమ్మాయి గా పుట్టాలా ఏఊరిలో పుట్టాలి అనే విషయాలను మనము నిర్ణయించలేదు. అలాగే మనము ఎన్ని సంవత్సరాలు జీవిస్తాము అనే విషయము కుడా మన చేతిలో లేదు.

1.1.2 మనిషి ఈ భూమి పై పూర్తిగా ఉండే సమయం 100 సంవత్సరాలైతే అది 36525 రోజులతో సమానము.. మీకు ఊహ తెలిసే సరికి మీవయస్సు 6 సంవత్సరాలైతే ఆ సమయము పూర్తిగా మీ అదీనములో లేదు. ఉదాహరణకు ఇప్పుడు మీ వయస్సు 15 సంవత్సరాలైతే ఇప్పటికి 5475 రోజులు ఖర్చు అయిపోయినవి... మన జీవితములో సగము పైగా సమయము నిద్రకు ఆహారానికి వినోదాలకు ఖర్చు అవుతుంది.. ఈ విదంగా చూస్తే మన అభివృద్దికి ఏవైనా గొప్ప లక్ష్యాలను సాధించటానికి మనకు మిగిలే సమయము ఎంత అనేది అది ఎంత విలువైనది అర్ధమవుతుంది.

1.1.3 మనము పుట్టుకకు ముందు మనము లేము మన మరణము తరువాత మనము ఈ భూమిపై ఉండము..అంటే జీవితమంటే మనము ఈ భూమిపై గడిపే సమయము..అది అత్యంత విలువైనది అని గమనించవచ్చు..జీవితమంటే సమయమే..సమయనాన్ని వృదా చేయటము అంటే జీవితాన్ని వృదా చేయటము తో సమానము అన్నమాట..సమయాన్ని బాగా ఉపయోగించటము అంటే జీవితాన్ని సార్ధకము చేసుకోవటము....ఉదాహరణకు...ఒక కోటీశ్వరుడైన వ్యక్తి గుండె పోటుకు గురయ్యాడు అనుకుందాము..అయన కుమారుడు ప్రపంచము లో చాలా పేరు ప్రక్యాతులున్న 20 మంది వైద్యులను పిలిచి తన తండ్రిని 20 నిమిషాలపాటు సృహలోనికి తేవటానికి 20 కోట్లు ఇస్తాను అని చెప్పినా కుడా ఆ వైద్యులు ఆ విషయములో ఖచ్చితముగా మాట ఇవ్వ లేరు...

1.1.4 మన జీవితములో సమయము ఖర్చు పెడితే చేజారిపోతుంది.మన ప్రమేయము లేకుండానే మనము ఏ పని చేయకుండా కూర్చున్నా సమయము దొర్లిపోతుంది...ఒక్కొక్క క్షణము వజ్రము కంటే విలువైనది...అందువలన సమయ దుర్వినియోగము జీవిత దుర్వినియోగము తో సమానము..మనము ఖర్చు చేసే ప్రతినిమిషము ఎటువంటి పనిమీద చేస్తున్నాము అనే విచక్షణ అవసరము..అలా అలోచించి చేసే వ్యక్తి తనకున్న పరిమిత కాలాన్ని మంచి విదానములో ఉపయోగించుకొంటాడు.

1.1.5 అందుకే మనము ప్రతి క్షణాన్ని విజ్ఞతతో ప్రయోజనాత్మకముగా మనకి గాని మన తోటి వారికి గాని మన సమాజానికి గానీ ఉపయోగ పడే విదంగా ఉపయోగించాలి.. ఎవరైతే తాము చదువుకొనే సమయాన్ని జీవితాన్ని విలువైనది గా మార్చుకోవటానికి నిరంతరము విజ్ఞానాన్ని సంపాదించుకొంటూ వినియోగిస్తారో వారే జీవితాన్ని సక్రమమైన మార్గము లోనికి నడుపుకోగలుగుతారు..

1.1.6 చదువు అనేది తల్లిదండ్రుల కోసమో...కేవలం డబ్బు సంపాదించే తెలివితేటల కోసమో కాక ఇష్టముతో గొప్ప లక్ష్యాలను సమాజానికి మంచి చేసే గమ్యాలు సాదించాలనే ఆశయాలతో చదివిన వ్యక్తి కాల క్రమములో పేరు ప్రతిష్టలు మంచి పేరు సంపాదించి తన తల్లిదండ్రులకు కుటుంబానికి ఊరికి దేశానికి గౌరవ ప్రతిష్టలు సంపాదించ గలుగుతాడు...

1.1.7 దురలవాట్లకు బానిసై, కేవలము డబ్బు సంపాదన కోసమే, తాత్కాలిక ప్రలోభాలకు గురై, అవినీతి తో అక్రమాలతో హింసా మార్గాలలో పయనించే వ్యక్తి కాల క్రమములో అనేక ఇబ్బందులు ఎదుర్కొని తన జీవితాన్ని చేజేతులా పాడు చేసుకొంటాడు..దాని వలన తనకే కాకుండా తన వలన సమాజానికి కూడా చెడు జరుగుతుంది...

1.1.8 మనము చేసే పనులపైన మన అలావాట్ల పైన ఆధారపడి మన జీవితముంటుంది...అంటే మనము ఈరోజు చేసే పనులు మన జీవిత భవిష్యత్తును నిర్ణయిస్తాయి... తను చేసే పనులను నిర్మాణాత్మకంగా అబివృద్ది ద్రుష్టితో చేసినప్పుడు ప్రతి మనిషి జీవితం లో అబివృద్ది తధ్యము.. ఎంతటి పేద కుటుంబములో జన్మించినా ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నా తన సమయాన్ని విచక్షణతో నియమ నిష్టలతో సంపూర్ణ ఏకాగ్రతతో ఉపయోగించుకొనే వ్యక్తి కాల క్రమములో గొప్ప వ్యక్తిగా రూపాంతరము చెందుతాడు..

1.1.9 అవుల్ పకిర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం గారి జీవితం



అబ్దుల్ కలాం గారు 15 అక్టోబర్ 1931 రామేశ్వరంలో ఒక పేద కుటుంబములో జన్మించారు...చిన్నతనంలో చదువు కోవడానికి ధనము లేని కారణముతో న్యూస్ పేపర్ ను పంచే పనిని ఉదయము సమయములో చేసి గొప్ప శాస్త్రవేత్త కావాలనే లక్ష్యమును కలలు కనే వాడు..కాలక్రమము లో గొప్ప శాస్త్రవేత్త గా..భారత దేశము గర్వించ దగ్గనాయకునిగా...భారత ప్రెసిడెంటుగా..భారతరత్నగా ..గొప్పరచయితగా ఎదిగి అయన జీవితాన్ని ఎంతో మంది ఆదర్శముగా తీసుకొనే విదంగా ఎదిగారు... దానికి అంతటికి మూలము అయన తన జీవితంలో పాటించిన నియమాలు...సిద్దాంతాలు...గొప్ప అలవాట్లు...అంటే మనము కుడా మన జీవితాన్ని క్రమశిక్షణతో మలుచుకొంటే గొప్ప నాయకులుగా ఎదగటం సులభ సాద్యము అని అర్ధమవుతుంది



1.1.10 స్వామి వివేకానంద సూక్తి:





"లేచి నిలబడు ధైర్యము గా ఉండు..బలముతో ప్రయత్నించు..నీ జీవిత బాద్యతను మొత్తాన్ని నీ భుజస్కందాలపై స్వీకరించు..నీ జీవిత గమ్యాన్ని నీవే సృష్టిస్తావు..దానికి కావలసిన సకల శక్తి సంపదలు నీలోపలే దాగి ఉన్నాయి..వెలికి తీయి..నీ భవిష్యత్తుని నీవే నిర్మించుకో"...



1.2 మనకున్న జీవితసమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎలా?

1.2.1 నీవు ఒక రోజులో, వారంలో, నెలలో, సంవత్సరంలో చేయవలసిన పనులు ఒక ప్రణాళిక వేసుకొని వ్రాసుకోవాలి. ఆ విదంగా ప్రణాళిక వేసుకున్నపుడు మనము జీవితములో ఎటువైపు వెలుతున్నాము..ఆ ప్రయాణంలో మనము తీసుకోవలసిన మలుపులు ఏమిటి అనే దానిపై మనకు ఒక ఖచ్చితమైన అవగాహన వస్తుంది. మన మనస్సు నిండా మనము సాదించవలసిన లక్ష్యాలపై ద్రుష్టి ఉన్నపుడు మన సమయం ప్రతి క్షణం సద్వినియోగం చేసుకొనే అవకాశముంది.

1.2.2 ప్రతిరోజూ నిద్ర లేస్తూనే మనకు ఇంత గొప్ప మనవ జీవితాన్ని ప్రసాదించిన దైవానికి, తల్లిదండ్రులకు, గురువులకు మానసికముగా కృతజ్ఞతలు తెలుపుకొని మనముందున్న ఈ అపురూపమైన రోజును వినూత్నముగా సృజనాత్మకతతో ఎలా ఉపయోగించాలి...ఈ రోజులో మనము సాదించవలసిన, పూర్తి చేయవలసిన విషయాలు ఏమిటి అనేది గుర్తు చేసుకోవాలి. గంట గంటకు ప్రణాళిక వేసుకోవాలి..ఆ పనులు మన లక్ష్యము వైపు మనలను తీసుకు వెళ్ళేవి అయి ఉండాలి..అప్పుడు మనము ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకొంటాము.

1.2.3. మనము పనులు చేయటము ప్రారంబించినపుడు అనేక శక్తులు పరిస్థితులు వినోదాలు స్నేహితులు మన దారినుండి పక్కకు లాగే ప్రయత్నాలు చేయవచ్చు..ఆత్మ నిగ్రహముతో జీవించి మనము మన ప్రణాళికకు కట్టుబడి ఉండాలి. ఎటువంటి పరిస్థితులలోనూ మనము అనుకున్న లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి. మనము అనుకొన్నది సాదించలేనప్పుడు మనలను దారి మళ్లించిన వారే గేళి చేస్తారు.ఎద్దేవ చేస్తారు..అది మనము ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

1.2.4. మనము చేసేపనులను ముఖ్యమైనవి-త్వరగా చేయవలసినవి, ముఖ్యమైనవి-భవిష్యత్తులో చేయతగినవి, ముఖ్యమైనవి కానివి-త్వరగా చేయాలి అని మనము అనుకోనేవి, ముఖ్యమైనవి కానివి-భవిష్యత్తులో చేయాలి అని మనము అనుకోనేవి అనే నాలుగు విభాగాలుగా చేసి అందులో ముఖ్యమైనవి-త్వరగా చేయవలసినవి ముందు ముగించాలి..సాద్యమైనంత వరకు ముఖ్యమైనవి-భవిష్యత్తులో చేయతగినవి, ముఖ్యమైనవి-త్వరగా చేయవలసినవిగా మారకుండా చూసుకోవాలి. మిగతా రెండు విబాగాలు ముఖ్యమైనవి కానివి-త్వరగా చేయాలి అని మనము అనుకోనేవి, ముఖ్యమైనవి కానివి-భవిష్యత్తులో చేయాలి అని మనము అనుకొనే పనులకోసము చాలా తక్కువ సమయం కేటాయించాలి...

1.2.5. మనము చేసే పనుల ఫలితాలను ముందుగానే ఆలోచించి మంచి ఫలితాలున్న పనులను మాత్రమే చేయాలి. మన పనుల పర్యవసానాలను వాటి వలన జరిగే ప్రయోజనాలను అంచనా వేసుకోనప్పుడు మనము గుడ్డెద్దు చేలో పడ్డట్టు ప్రయాణం చేసే అవకాశముంది.మన సమయాన్ని వృదా పనుల పై గడిపే అవకాశముంది. అందువలన సంపూర్ణ విశ్లేషణ తో ముందు చూపుతో మనము చేయబోయే పనులను అవగాహన చేసుకుంటూ ముందుకు కదలాలి..

1.2.6. నీ జీవితానికి ఉపయోగపడే పనులను ఇష్టముతో ఆనందముతో నీవు సాధించబోయే విజయాలను ఊహించుకొంటూ ఉత్సాహముతో ఓర్పుతో ఆ పనులను నిర్వహించినపుడు నీవు చేసే పనిని ఒక ఆట లాగ చేయగలవు. అంతే కాకుండా నీవు ప్రతి క్షణాన్ని ఆనందముతో నింపుకోగలవు.

1.2.7. మనము చేసే పనులలో వినోదానికి, క్రీడలకు 20% లోపు సమయాన్ని మాత్రమే కేటాయించాలి.. అనవసరమైన సంబాషణలు..అతిగా టీవీ ప్రోగ్రాములు,ఫోనుపై నిరుపయోగమైన మాటలు తగ్గించి మన లక్ష్యాలవైపు ఉపయోగపడే పనులు కొనసాగించాలి.

1.2.8.ప్రతిరోజూ పడుకోబోయే ముందు మనము అనుకొన్న పనులు పూర్తి చేసామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకొని డైరీలో వ్రాసుకోవాలి.మనము సమయాన్ని ఎలా ఉపయోగించాము..మంచి పనులు ఏమి చేసాము. ఎటువంటి వృదా పనులు చేసాము అనేది విశ్లేషించుకొని, మనము రేపు ఎతున్వంటి జాగ్రత్తలు తీసుకొంటాము, మన లక్ష్యాలను చేరుకోవటానికి మనము మార్చు కోవలసిన పద్దతులను దానికొరకు మనము పాటించబోయే ఉపాయాలను ఆలోచించుకొని నిద్రకు ఉపక్రమించాలి.

1.2.9.మనము చేస్తున్న పనిలో సంపూర్ణమైన ఏకాగ్రత ఉంచి దానిలో మెళుకువలను సృజనాత్మకతను పెంచుకొంటూ కొత్త విదానాల ద్వారా తక్కువశ్రమతో ఎక్కువ ఫలితాలను సాదించే దిశగా పయనించాలి. ప్రతిరోజూ నిన్నటికంటే మెరుగైన పద్దతి లో మనము పనులు నిర్వహించగలము అని నమ్మి జీవితాన్ని గడపాలి..ఆ దిశగా అనుక్షణము ఆలోచన సాగించాలి.మనము ఎదుర్కొనే ప్రతి సమస్యను సవాళ్ళను మన చాతుర్యము తో బుద్దిబలముతో పరిష్కరించవచ్చు. మన మెదడులో సాగే ఈ ఆలోచన మనలను సృజనాత్మకత వైపు నడిపిస్తుంది విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ప్రతి పనిని మనము చేసే విదానములో చిన్న చిన్న అభివృద్ధి చేస్తూ పోయినపుడు కాలాంతరములో ఆ మార్పు ఒక గొప్ప మార్పుగా మారుతుంది.

1.2.10.మనము ఏ రంగములో అయితే ఎదుగుదాము అనుకొంటున్నామో ఆ రంగము గురించి సంపూర్ణ అవగాహన కొరకు ప్రాక్టికల్ గా ప్రయోగాలు చేస్తూ అందులో ఉన్న నిపుణులతో సంబాషిస్తూ, పుస్తకాలను చదువుతూ ఇంటర్నెట్ లో పరిశోధిస్తూ కొత్త విజ్ఞాన్ని జిజ్ఞాసతో సంపాదిస్తూ కొనసాగాలి. ఆ విదమైన అలవాట్లు మనలను మనము ఎంచుకొన్న రంగములో సుప్రసిద్ధ వ్యక్తిగా మారుస్తాయి..మనము ఎంచుకొన్న గమ్యములో ప్రయాణించి విజయాన్ని సాధించిన వ్యక్తుల గురించి మనము తెలుసుకొన్నపుడు, వారి జీవిత సత్యాలు వారు తీసుకొన్న నిర్ణయాలు మనలను ప్రభావితం చేస్తాయి..మన జీవిత గమ్యానికి మనలను సిద్దము చేస్తాయి..మనలో ఉత్సాహాన్ని కార్యదీక్షను ఏకాగ్రతను పెంపొందిస్తాయి. నిరంతరము మనము చేసే కృషి, పరిశోదన,సంబాషణ మనలో శక్తి సామర్ద్యాలను పెంచి మన మీద మనకు ఆత్మ విశ్వాసము పెంచుతుంది..అనేక విజయాలు మనలను వరిస్తాయి..మనము గురిపెట్టిన ఎటువంటి లక్ష్యాన్నైనా పూర్తి విశ్వాసం తో సాధించగలము.



1.3 జీవిత గమ్యాన్ని లక్ష్యాలుగా మార్చుకుని సాధించటం ఎలా ?



1.3.1 మన జీవితగమ్యము మనమే నిర్ణయించుకోగలుగుతాము.అది మనము చేసే పనులు, ఆలోచనలు ,విధానాలు మరియు అలవాట్లల ఫై ఆధారపడి ఉంటుంది.

1.3.2 మన జీవిత కాలములో మనము నెరవేర్చే లక్ష్యాలన్ని కలిపితే మన జీవిత గమ్యముగా మరుతుంది.అంటే మన జీవితములో మనము చేసిన పనులు , చేసిన నిర్మాణాలు,ఇచ్చిన క్రొత్త వస్తువులు, ప్రక్రియలు అన్నమాట.

1.3.3 మనకు ఏది ఇష్టమైన పని అనేది మనము నిర్ణయించుకుని ,నెరవేర్చాలనుకొన్న లక్ష్యాలను గుర్తించి మనము వాటిని సాకారము చేసుకునే దిశగా అడుగులు వేయాలి.

1.3.4 రాబోయే 2 సంవత్సరాలు 5,10,15,20,30 సంవత్సరాలలో నీవు సాధించాలనుకున్న అన్ని విషయాలను ఒక్కసారి ప్రణాళికగా మార్చుకొని వాటిని సాధించే దిశగా నిరంతరం కృషి చేయాలి. అప్పుడు మనకు జీవితగమ్యముఫై ఒక నియంత్రణ వస్తుంది.

1.3.5. ఎపుడైతే నీవు నడవాలనుకున్న మార్గము జీవితలక్ష్యాలు అర్ధమవుతాయో నీలో అనంతమైన శక్తి ప్రేరణ రావటము జరుగుతుంది.

1.3.6 నీ లక్ష్యాలను ఒక వాల్పోస్టరు లాగా మార్చుకొని వాటికి కాలపరిమితి విదించి నిరంతరం వాటిగురించే నీ ఆలోచనలు పనులు సాగినపుడు ఆ లక్ష్యాలన్నింటిని సాధించటము అనేది చాల సులభమైన మార్గము.



1.3.7.నీ ఆలోచనలు అన్నీ నీ లక్ష్యాలతో నిండిపోవాలి నీ విజయాలవెనుక రహస్యం ఏమిటని ప్రసిద్ధ శ్యాస్త్రవేత న్యూటన్ ని అడిగినప్పుడు తను అహర్నిశలు ప్రయోగాల గురించే ఆలోచించటం అని చెప్పాడు. గొప్ప వ్యక్తులంతా తమ మెదడును లక్ష్యాల వైపు మాత్రమే ఆలోచించేలా తాయారు చేస్తారు. ప్రతిరోజూ కనీసము పది నిముషాలు సమయాన్ని తీసుకొని నివు సాధించవలసిన లక్ష్యాలు సాధించినట్లుగా దర్శించాలి అప్పుడు మన లక్ష్యాల వైపు మనము పయనిస్తాము.

1.3.8. మన మీద మనము వత్తిడి పెంచుకోవాలి. లక్ష్యాలను సాధించటానికి కావలసిన సానుకూల వత్తిడిని కలిగించుకొంటూ ఉండాలి. మనము సాదించబోయే లక్ష్యాలను ఇతరులకు చెప్పటం ద్వారా వాటిని సాధించటానికి కావలసిన వత్తిడి మనకు కలిగి మనలను నడుపుతుంది.

1.3.10. నీ పనికి, లక్ష్యాలకు కావలసిన మానసిక బలాన్ని ప్రోత్సహన్నిచ్చే వ్యక్తులను సంపాదించు. వారితో నిత్యమూ నీ లక్ష్యాల గురించి వాటిలోని వొడిదుడుకుల గురించి చర్చిస్తూ ఉంటే నీకు ఆ లక్ష్యాలను సాదించగల స్పూర్తి లభిస్తుంది. వారినుండి ప్రోద్బలము, విశ్లేషణ లభిస్తాయి.ఏ పనినైన మనము క్రమము తప్పకుండా 21 రోజులు చేసినట్లయితే అది మనకు ఒక అలవాటుగా మారుతుంది ఆ తరువాత ఆ అలవాటును మనము ఆనందించటం ప్రారంబిస్తాము. అందువలన మనము మంచి అలవాట్లను ఈ సిద్దాంతం ద్వారా మన జీవితంలోకి ఆహ్వానించాలి. మన లక్ష్యాలకు సంబందించిన అలవాట్లను పెంచుకోవాలి.



1.4. జీవిత విజయాలకు మూలము క్రమశిక్షణ మరియు పట్టుదల:

1.4.1. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే మొదట అలవార్చుకోవాల్సిన లక్షణాలు క్రమశిక్షణ మరియు పట్టుదల. ఈ రెండు లక్షణాలు ఉన్నప్పుడు ఏకాగ్రత అభివృద్ధి చెంది, అనుక్షణం అభివృద్ధి సాధిస్తూ నీవనుకొన్న లక్ష్యాలను చేరుకోగల్గుతావు.

1.4.2. మనలో దాగి ఉన్న అంతర్గత శక్తి ఈ రెండు లక్షణాల ద్వారా బయటకు తీయవచ్చును. అనవసరమైన విషయాలవైపు మనము వెళ్ళకుండా ఇవి నివారిస్తాయి. మనకు స్వీయ నియంత్రణ వస్తుంది.

1.4.3. పట్టుదల అనేది మన లక్ష్యము వైపునకు మనము వెళ్ళేటట్లు చేస్తుంది. క్రమశిక్షణ అనేది మన లక్ష్యము పైన మన దృష్టి ఉంచి దానికి కట్టుబడి నమ్మకముతో కృషి చేయటాన్ని నేర్పుతుంది.

1.4.4. ఏ విషయములోనైనా విజయము సాధించటానికి మన ఏకాగ్రత మరియు నిరంతర కృషి అవసరము. క్రమశిక్షణ ఈ విషయాలను మనకు అలవాటు చేస్తుంది.

1.4.5. మొదలుపెట్టినప్పుడు ఇవి కష్టము అనిపించినప్పటికీ అలవాటుగా మారిన తరువాత నిత్య సంతోషాలను మనకు అందించి సానుకూల దృక్పధాన్ని పెంచి, నీవు పెద్ద పెద్ద విషయాలను మనము సాధించగలిగే విధముగా తయారు చేస్తాయి. అన్ని విధాల అభివృద్ధి సాధ్యం.

1.4.6. ఈ రెండు గుణాలు లేని వ్యక్తి మనసుకు బానిసై అనవసరమైన ఆలోచనలను ఆహ్వానించి దృష్టి పనికి రాని పనుల వైపు మళ్ళించబడి వినోద ప్రధానమైన కార్యక్రమాలతో తృప్తి పడి పోతాడు. మహాత్మా గాంధీ, వివేకానంద, మదర్ తెరెసా, హెలెన్ కెల్లెర్ ... జీవితాలను గమనిస్తే వారు క్రమశిక్షణ మరియు పట్టుదల ఎలా వాడారో తెలుస్తుంది. వారి విజయానికి ఇవే కారణాలు.

1.4.7. బయట ప్రపంచములో విజయాన్ని సాధించాలంటే మనము ముందు మన మనసులో సాధించాలి. మనలను మనం తక్కువ అంచనా వేసుకుంటే ఏ విజయాన్ని సాధించలేము.

1.4.8. మన పట్టుదలను నిశ్చలముగా ఉంచుకోవటం అభ్యాసం చేస్తే ఎటువంటి కలనైనా సాధించగలము. మన ఏకాగ్రతతో మన లక్ష్యం వైపు ఒక గురి పెట్టిన బాణం లాగా ఉన్నప్పుడు మన లక్ష్యమును తప్పక సాధించగలుగుతాము.

1.4.9. క్రమశిక్షణ, పట్టుదల అనే లక్షణాలు ప్రతి మనిషిలోను అంతర్గతముగా దాగి ఉంటాయి. వాటిని నిరంతర సాధన ద్వారా బయటకు తీయవచ్చును. ఒక సారి వాటిని వాడటం మొదలు పెట్టిన తర్వాత అవి క్రమ క్రమముగా బలము గా మారి గొప్ప విజయాలను సాధించటానికి మనిషిని నడిపిస్తాయి. వీటి వలన తన లక్ష్యము ఎంత కఠిన మైనను దానిని సాధించటానికి నిరంతర ప్రయత్నం చేస్తాడు.

1.4.10. మనలో అంతర్గతంగా ఉండే భయాలు, ఆందోళనలు, నిరర్ధకమైన ఆలోచనలు మన శక్తిని తగ్గిస్తూ ఉంటాయి. కానీ ఈ రెండు లక్షణాలు ఆ బలహీనతల నుండి మనలను రక్షించి గొప్ప విజయాలు సాధించే విధముగా చేస్తాయి.

1.4.11. మనము చాలా విషయాలు సాధించాలి అని అనుకుంటాము. కానీ మనము సాధించాలి అనుకున్న విషయము ఫై ఇష్టాన్ని పెంచుకోము. దాని వలన ఆ పని మనకు ఇబ్బంది గా అనిపిస్తుంది. మనము అలసిపోయినట్లుగా అయిపోతాము. ఈ స్థితి నుండి బయటకు వచ్చినప్పుడు మనము అనుకున్న విషయాలను తప్పక సాధిస్తాము. ఈ రెండు లక్షణాలు అందుకు సహాయం చేస్తాయి.

1.4.12. మనకు జీవితంలో నిజమైన ఆనందం లక్ష్యాలను చేసుకుని వాటిని సాధించటం ద్వారానే వస్తుంది. మన జీవిత చివరి దశలో మనము వెనుకకి తిరిగి చూస్తే మనము సాధించిన విజయాలే మనకు ఆనందాన్ని ఇస్తాయి. విజయము అంటే డబ్బు సంపాదన కాదు. మానసిక శాంతి, అన్ని విధాల అభివృద్ధి చెందిన వ్యక్తిత్వం. క్రమశిక్షణ మరియు పట్టుదలలు మనిషిని తన లక్ష్యాలు సాధించే విధముగా నడిపించి, ప్రోత్సహించి, ప్రేరేపించి మరియు స్ఫూర్తినిచ్చి విజయాలు సాధించే విధముగా తయారు చేస్తాయి.

1 comment: